అమర జవాన్లు, పోలీసుల పిల్లల ఉపకార వేతనాలు పెంపు

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈరోజు తొలిసారిగా మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో 24 మంది కేంద్రమంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు పాల్గొన్నారు. 

తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు: 

1. ఈ సమావేశంలో మొట్టమొదటగా ప్రధానమంత్రి కిసాన్ పధకం క్రింద దేశంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

2. ఉగ్రవాదులు, నక్సల్స్ దాడులలో అమరులైన జవాన్ల పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాలను పెంచాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు అమర జవాన్ల పిల్లలలో బాలురకు నెలకు రూ.2,000, బాలికలకు రూ.2,250 ఇచ్చేవారు. ఇక నుంచి బాలురకు నెలకు రూ. 2,500, బాలికలకు రూ.3,000 చెల్లించాలని నిర్ణయించారు. జవాన్లతో పాటు ఇకపై అమరులైన రాష్ట్ర పోలీసుల పిల్లలకు కూడా ఈ పధకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏడాదికి 500 మంది చొప్పున ఎంపిక చేసి చెల్లించాలని నిర్ణయించింది. భారత రక్షణ నిధి నుంచి ఈ ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ దీనికి సంబందించిన ఫైలుపై సంతకం కూడా చేసినట్లు సమాచారం. 

3. 60 సం.ల వయసు దాటిన రైతులందరికీ నెలకు రూ.3,000 పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.  

4. ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 17వ తేదీ నుంచి జూలై 26వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తాత్కాలిక స్పీకరుగా మేనకా గాంధీ వ్యవహరిస్తారు. ఆనవాయితీ ప్రకారం ముందుగా జూన్ 17వ తేదీన ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ తరువాత రెండు రోజులూ కొత్త ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. జూన్ 19వ తేదీన లోక్‌సభ స్పీకరును ఎన్నుకొంటారు. ఆ తరువాత రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించి ధన్యవాదాలు తెలుపుతారు. జూలై 5వ తేదీన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.  

ప్రస్తుతం ఇంకా సమావేశం జరుగుతోంది. కనుక మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.