సూర్యాపేటలో చేపల చెరువులు లూటీ!

సూర్యాపేట జిల్లాలో వరుసగా చేపల చెరువులు లూటీ అవుతున్నాయి. రెండు వారాల క్రితం జిల్లాలో మునగాల మండలంలో వందలాదిమంది ప్రజలు గణపవరం చేపల చెరువులోని చేపలను లూటీ చేశారు. ఒకేసారి వందలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు తరలివచ్చి చెరువులో దిగి అందినకాడికి చేపలు ఎత్తుకుపోయారు. 

మళ్ళీ గురువారంనాడు మేళ్లచెర్వు మండలంలోని కందిబండ చెరువులో చేపలను అదే తరహాలో గ్రామస్తులు లూటీ చేశారు.   

రెండు రోజుల క్రితం కందిబండ చెరువులో కొందరు వ్యక్తులు చేపలను వేటాడుతుండగా వాటిని పాడుకొన్న కాంట్రాక్టర్లు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాల మద్య ఘర్షణలు చెలరేగాయి. వారు పరస్పరం రాళ్ళతో దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిన్న ఉదయం ‘కందిబండ చెరువులో ఉచితంగా చేపలు పట్టుకోవచ్చునని’ ఎవరో పుకారు పుట్టించడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు తరలివచ్చి చెరువులో దిగి అందినకాడికి చేపలు ఎత్తుకుపోయారు. కొంతమంది వలలు, గోనె సంచులతో తరలివచ్చి భారీ సంఖ్యలో చేపలను ఎత్తుకుపోయారు. 

ఈ సందర్భంగా చేపలను పాడుకొన్న కాంట్రాక్టర్లు ఆగ్రహంతో చెరువుకు వచ్చిన గ్రామస్తుల ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. దాంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు తరలివచ్చినప్పటికీ వందలాదిగా తరలివచ్చిన ప్రజలను అడ్డుకోలేకపోవడంతో గ్రామస్తులు యదేచ్చగా చెరువులో చేపలను లూటీ చేసి తీసుకుపోయారు. 

సుమారు రూ.25 లక్షలు విలువగల చేపలు లూటీ అయ్యాయని, తమకు తీవ్ర నష్టం జరిగిందని చేపల కాంట్రాక్టర్లు చెప్పారు. గ్రామస్తులు చెరువులో దిగి చేపలను వేటాడుతుండగా తీసిన ఫోటోలను, వీడియోలను వారు పోలీసులకు అందజేసి గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

చేపల కాంట్రాక్టర్లు తమ వాహనాలకు నిప్పుపెట్టి తగులబెట్టారని గ్రామస్తులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.