
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ కొన్ని హామీలు, వరాలు ప్రకటించారు.
1. ఈనెల నుంచే రాష్ట్రంలో పింఛను నెలకు రూ.2,250 పెంచుతున్నాను. ఏడాదికి రూ.250 చొప్పున దానిని పెంచుతాను.
2. ఈ ఏడాది ఆగస్ట్ 15లోగా రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో ఒక వాలంటీర్ చొప్పున 4 లక్షల మందిని నియమించబోతున్నాను. వారికి నెలకు రూ.5,000 గౌరవవేతనం చెల్లిస్తాము. ప్రజలకు సేవ చేయాలనే తపన, సేవాగుణం ఉన్నా విద్యావంతులకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రభుత్వ పధకాల అమలు, గ్రామాలలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వారి బాధ్యత. వారికి ఏవైనా మంచి ఉద్యోగాలు వచ్చేవరకు వాలంటీర్లుగా పనిచేసుకోవచ్చు.
3. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతిలోగా రాష్ట్రంలో ప్రతీగ్రామానికి ఒక సచివాలయం నిర్మించి దానిలో 10 మంది చొప్పున కొత్తగా 1.60 లక్షల ప్రభుత్వోగాలు కల్పిస్తాము.
4. గ్రామాలలో ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా, దేనికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా గ్రామసచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకొంటే 72 గంటలలోగా దానిని పరిష్కరిస్తాం.
5. ఒకవేళ రాష్ట్రంలో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లయితే వారిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం త్వరలోనే ఒక కాల్ సెంటరును ఏర్పాటు చేస్తాం.
6. పైస్థాయి నుంచి క్రిందస్థాయి వరకు అవినీతిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
7. ప్రభుత్వంలో, టెండర్ల ప్రక్రియలో పూర్తిపారదర్శకత, పనులలో నాణ్యత పెంచేందుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తాం.
8. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ వారి కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపద్యం, పార్టీలను చూడకుండా అందరికీ ప్రభుత్వ పధకాలు అందేలా చేస్తాం.
9. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా రాష్ట్రంలో సమూలమైన మార్పులు ప్రజలు చూస్తారు.