పరిషత్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తుంది. జూన్ 7న మండల పరిషత్, జూన్ 8న జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలకు నిర్వహిస్తుంది. మొదట ప్రతీ మండల పరిషత్‌లోను మైనార్టీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని, జిల్లా పరిషత్‌లో ఇద్దరినీ తప్పనిసరిగా కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాలి.

ఒకవేళ ఏ కారణం చేతైన పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆ రోజున పూర్తికాకపోతే మళ్ళీ ప్రత్యేకసమావేశం ఏర్పాటుచేసుకొని ఎన్నికలు నిర్వహించుకొనేందుకు ఎన్నికల సంఘం అనుమతి పొందవలసి ఉంటుంది. ప్రిసైడింగ్ అధికారి సూచన మేరకు తదుపరి సమావేశం తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి తెలిపారు. కో-ఆప్టెడ్ సభ్యుల నియామకాలు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గాలు పదవీ భాద్యతలు చేపట్టవలసిన తేదీలను ప్రకటిస్తామని నాగిరెడ్డి చెప్పారు.

ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటివారం వరకు ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పాలకవర్గం పదవీకాలం ఆగస్ట్ వరకు ఉంది. కనుక కొత్తగా ఎన్నికైనవారు అప్పటివరకు ఎదురుచూడక తప్పదు.