
రాజకీయ నాయకులు మీడియా ద్వారా ఎలాగూ పరస్పరం విమర్శించుకొంటుంటారు. ఇంకా సరిపోకపోతే బహిరంగలేఖల పేరిట ఘాటుగా విమర్శలు గుప్పించుకొంటారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బుదవారం ఒక బహిరంగలేఖ వ్రాశారు.
“తెరాసకు ప్రజాతిరస్కరణ మొదలైందని లోక్‌సభ ఫలితాలతో స్పష్టం అయ్యింది. నిజామాబాద్, కరీంనగర్ స్థానాలలో తెరాస అభ్యర్ధులను ప్రజలు తిరస్కరించారు. సిద్ధిపేట, సిరిసిల్లాలలో తెరాసకు మెజార్టీ తగ్గింది. మల్కాజ్‌గిరిలో ప్రశ్నించే గొంతును ప్రజలు ఆదరించారు. నాలుగు నెలల వ్యవదిలో తెరాస గ్రాఫ్ వేగంగా పడిపోయిందని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ఎంత ప్రజాధారణ ఉందనేదే ప్రామాణికం కానీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 ఏళ్ళ క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలతో పోల్చుకొని గొప్పగా ఉందని కితాబు ఇచ్చుకోవడం అతితెలివికి నిదర్శనం. మల్కాజ్‌గిరిలో నన్ను ఓడించడానికి కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ నా గెలుపును తక్కువగా చేసి చూపే ప్రయత్నం చేయడం గురివింద గింజ సామెతను గుర్తు తెస్తుందని లేఖలో వ్రాశారు.