రవిప్రకాశ్‌కు హైకోర్టులో మళ్ళీ చుక్కెదురు

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు మళ్ళీ తిరస్కరించింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో పెండింగులో ఉన్న కేసుపై మళ్ళీ హైదరాబాద్‌ పోలీసులు మూడు వేర్వేరు క్రిమినల్ కేసులు బనాయించారని, రవిప్రకాశ్‌ పోలీసుల ముందు హాజరయ్యి తన వాదనలు వినిపించుకోవడానికి వీలుగా ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్‌పై మంజూరు చేయాలని ఆయన తరపున న్యాయవాది వాదించారు. 

రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పనే లేదని కేవలం విచారణకు హాజరవ్వాలని మాత్రమే కోరారని, కానీ వరుసగా రెండుసార్లు నోటీసులు పంపించినా ఆయన విచారణకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. రవిప్రకాశ్‌ ఏ తప్పు చేయకపోతే పోలీసుల విచారణకు హాజరవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రెండుసార్లు నోటీసులు పంపినా రవిప్రకాశ్‌ విచారణకు హాజరుకానందునే ఆయనకు సీఆర్‌పీసీ 41 ప్రకారం నోటీసులు పంపవలసి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌పై పిటిషన్‌ తిరస్కరించింది. 

ఇప్పుడు రవిప్రకాశ్‌ ముందు రెండే మార్గాలున్నాయి. 1. విచారణకు హాజరవడం. 2. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోవడం.