మే 27వరకు ఎన్నికల కోడ్!

 మే23న లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి కానీ మే 27వరకు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు ఆయన చెప్పిన కారణం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కౌటింగ్ పూర్తయిన తరువాత ఏవైనా తేడాలు వస్తే మళ్ళీ రీపోలింగ్ నిర్వహించవలసివస్తుంది కనుక మే 27వరకు కోడ్ కొనసాగిస్తామని చెప్పారు. ఒకవేళ కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించినా, వాటికీ వివి ఫ్యాట్ స్లిప్పులకు తేడాలు వచ్చినా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనే విచక్షణాధికారం  రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని అన్నారు. పార్టీల మద్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నా కూడా రీపోలింగ్‌కు ఆదేశించే అధికారం తమకు ఉంటుందని ద్వివేది చెప్పారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల కమీషన్‌పై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితాలు వెల్లడైన తరువాత కూడా మళ్ళీ రీపోలింగ్ జరుగవచ్చని, అంతవరకు ఎన్నికల కోడ్ కొనసాగిస్తామని చెప్పడంపై అనుమానాలు కలిగిస్తుంది. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ జరుపవలసివస్తే అప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ విధించవచ్చు. కానీ ఫలితాలు వెలువడక మునుపే ఎన్నికల కోడ్ కొనసాగిస్తామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై టిడిపి ఏమంటుందో తేలికగానే ఊహించవచ్చు.