ఎగ్జిట్‌ పోల్స్‌ని నమ్మోద్దు: వెంకయ్య నాయుడు

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి యావత్ బిజెపి నేతలు ఆనందంతో పొంగిపోతుంటే, మాజీ బిజెపి, నేత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం “ఎగ్జిట్‌ పోల్స్‌ను నమొద్దు...మే 23న వెలువడే ‘ఎగ్జాట్ పోల్’ ఫలితాల కోసమే ఎదురుచూడండి,” అని చెప్పడం విశేషం. 

గుంటూరులో నిన్న జరిగిన ఆత్మీయసత్కార సభలో మాట్లాడుతూ, “1999 నుంచి వెలువడుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌లో చాలా వరకు సరైన అంచనా వేయలేకపోయాయి. కనుక నిన్న వెలువడిన వాటిని కూడా పట్టించుకోనవసరంలేదు. శాస్త్రీయంగా అధ్యయనం చేయని ఎగ్జిట్‌ పోల్స్‌కు ఎటువంటి బేస్ ఉండదు కనుక అవన్నీ కాకి లెక్కలుగానే భావించాలి. మే 23న ఫలితాలు వెలువడేవరకు అన్ని పార్టీలు తామే గెలుస్తామంటూ భుజాలు చరుచుకొంటూనే ఉంటాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటేనే ఎన్నికలు, పార్టీలు, అభ్యర్ధుల వలన ప్రజలకు మేలు జరుగుతుంది. అభ్యర్ధుల క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీలను సరిగ్గా అంచనావేసి ఎన్నుకోవలసి ఉండగా దురదృష్టవశాత్తూ నేడు ప్రజలు అభ్యర్ధుల క్యాస్ట్ వారిచ్చే క్యాష్ చూసి ఓట్లేస్తున్నారు. రాజకీయపార్టీలు వాటి అభ్యర్ధులు ఎన్నికలలో ఉపయోగించే బాష కూడా చాలా దారుణంగా ఉంది. చట్టసభలు నడుస్తున్న తీరు నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఎన్నికలను డబ్బు మయం చేయడం ద్వారా మన ప్రజాస్వామ్య విలువలను మనమే దిగజార్చుకొని మనం సృష్టించుకొన్న ఆ వ్యవస్థను మనమే అపహాస్యం చేసుకొంటున్నాము, “ అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన చెప్పిన మిగిలిన విషయాలను కాసేపు పక్కన పెడితే ‘ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మోద్దు’ అని చెప్పడమే ఆలోచింపజేస్తోంది. కేంద్రంలో బిజెపి, ఏపీలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాయని సర్వేలు చెపుతుంటే వాటిని నమొద్దని వెంకయ్యనాయుడు చెప్పడం అవి నిజం కాకపోవచ్చునని చెపుతున్నట్లుంది. 

ఆయనకు చంద్రబాబునాయుడుతో మంచి అనుబందం ఉంది కనుక ఏపీలో మళ్ళీ టిడిపి రావాలనికోరుకోవడం సహజమే. కానీ కేంద్రంలో మళ్ళీ బిజెపి రావాలని కోరుకొంటున్నారా లేదా? అనేదే ప్రశ్న. ఎందుకంటే ఇంకా మరికొన్నేళ్ళు రాజకీయాలలో చురుకుగా పాల్గొందామని అనుకొన్న ఆయనను ఉపరాష్ట్రపతిగా చేసి మోడీ పక్కనపెట్టారని జనాభిప్రాయం. 

కేంద్రమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో సహాయపడుతున్న ఆయనను ఉపరాష్ట్రపతిగా చేయడంతో ఆయన చేతులు కట్టేసినట్లయింది. ఆ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా డిల్లీలో ఒక పెద్ద దిక్కును కోల్పోయాయని చెప్పవచ్చు. వెంకయ్యనాయుడులో కూడా ఆ బాధ ఉండే ఉంటుంది కనుక అదే ఈవిదంగా బయటపడిందేమో?