హాజీపూర్‌ ఘటనలపై స్పందించిన కేటీఆర్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ హత్యాచారాలపై ఎట్టకేలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. హాజీపూర్‌ బాధిత కుటుంబాలతో కలిసి గ్రామస్తులు న్యాయం కోరుతూ బొమ్మలరామారం మండలంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోగా శనివారం రాత్రి పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా మల్యాల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తమ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళేందుకు దీక్షా శిబిరం ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తమకు న్యాయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మరుసటిరోజు ఉదయమే కేటీఆర్‌ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. 

హాజీపూర్‌లో జరిగిన ఘటనలపై సిఎం కేసీఆర్‌ కూడా బాధ పడుతున్నారని చెప్పారు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తామని, ఈ హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి చట్టప్రకారం కటినమైన శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తామందరం ఎన్నికల హడావుడిలో ఉన్నందున అది ముగిసిన వెంటనే తానే స్వయంగా హాజీపూర్‌ వచ్చి బాధితకుటుంబాలను పరామర్శిస్తానని అంతవరకు సంయమనం పాటించాలని కోరారు. హాజీపూర్‌ గ్రామస్తుల సమస్యలు, డిమాండ్లు అన్నీ పరిష్కరిస్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.