
సిఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్లనుద్దేశ్యించి సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మేము ఏ సమస్య గురించి గవర్నర్ నరసింహన్కు వినతిపత్రం ఇచ్చినా దానిని ఆయన చెత్తబుట్టలోనే పడేస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయన తిరుపతిలో పూజారిగా మాత్రమే పనికివస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటనలపై అందరూ స్పందించారు కానీ సిఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదు. ఇంతవరకు బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. వారికి ఎటువంటి ఆర్ధికసహాయం అందించలేదు. పైగా ఆ కేసును పక్కదారి పట్టించి అటకెక్కించేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన సంఘటనలు జరుగుతుంటే సిఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? ఆయన పట్టించుకోకపోతే గవర్నర్ నరసింహన్ ఏమి చేస్తున్నారు? హాజీపూర్ బాధితకుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. హాజీపూర్ గ్రాంస్తులు కోరినట్లుగా గ్రామానికి బస్సు సౌకర్యం, పోలీస్ అవుట్ పోస్ట్, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతుంది,” అని అన్నారు.
నిజానికి హాజీపూర్ ఘటనలలో ప్రభుత్వం తప్పేమీ లేదు కనుక దానిని నిందించడానికి కూడా లేదు. కానీ వరుసగా మూడు హత్యలు జరిగినట్లు తెలిసిన తరువాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరూ స్పందించకపోవడంతో వి.హనుమంతరావు వంటివారు ప్రభుత్వాన్ని వేలెత్తిచూపగలుగుతున్నారు. కనుక ఇప్పటికైనా హాజీపూర్ బాధితకుటుంబాలను పరామర్శించి వారికి తగిన నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుంది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ఏకంగా రెండు కోట్లు అప్పనంగా ముట్టజెప్పగలిగినప్పుడు, అన్యాయంగా పిల్లలను కోల్పోయిన ఆ నిరుపేద బాధితకుటుంబాలకు సముచిత నష్టపరిహారం చెల్లించవచ్చు కదా?