తొలి మీడియా సమావేశంలో మోడీ మౌనముద్ర

ప్రధాని నరేంద్రమోడీ నిన్న మొట్టమొదటిసారిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మొదట బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరే నిర్వహించాలనుకొన్నారు కానీ దానిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు. ప్రెస్ మీట్ అంటే తాను చెప్పదలచుకొన్నది చెప్పడమే కాదు విలేఖరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ తాను చెప్పదలచుకొన్నది చెప్పేసి విలేఖరులు ప్రశ్నలడిగినప్పుడు వాటికి అమిత్ షా సమాధానం చెపుతారని తప్పించుకొన్నారు. 

“మాది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు పార్టీ అధ్యక్షుడే బాస్. అన్నీ ఆయనే చూసుకొంటారు. నాతో సహా పార్టీలో అందరూ క్రమశిక్షణ కలిగిన సైనికులవంటివారం. కనుక మీ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెపుతారు,” అంటూ లౌక్యంగా సమాధానం చెప్పి విలేఖరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకొన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా, ప్రశాంతంగా  ఉన్నాయని, కనుక బిజెపి కూటమి 300కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని అమిత్ షా చెప్పారు. 

బిజెపి కార్యాలయంలో మోడీ, అమిత్ షాలు ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలుసుకొని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్‌ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో మోడీ ప్రెస్ మీట్ నిర్వహించిన తీరును ఎద్దేవా చేశారు. “మోడీజీ... యుద్దం ముగుస్తున్న సమయానికి మీడియా ముందుకు వచ్చినందుకు అభినందనలు. రఫెల్ యుద్ధవిమానాలతో సహా పలు అంశాలపై నాతో బహిరంగ చర్చకు రావాలని నేను ఎన్నిసార్లు కోరినా మీరు సాహసం చేయలేకపోయారు. చివరికి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు జవాబు చెప్పేందుకు భయపడ్డారు. అందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈసారి విలేఖరులు అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పడానికి మీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మిమ్మల్ని అనుమతిస్తారనుకొంటున్నాను,” అని ఎద్దేవా చేశారు.