టీవీ9 రవిప్రకాశ్‌కు హైకోర్టు షాక్

టీవీ9 రవిప్రకాశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అలందా మీడియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. కానీ హైకోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయన బుదవారం మధ్యాహ్నం 11.30 గంటలకు పోలీసుల ముందు హాజరుకావలసి ఉంది. కానీ ఇంతవరకు హాజరుకాలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించినందున ఆయన స్వయంగా పోలీసులకు లొంగిపోవడమో లేదా ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేసుకోవడం చేయాల్సి ఉంటుంది. రవిప్రకాశ్‌ కోసం పోలీసులు ఇంకా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇవాళ్ళ సాయంత్రంలోగా విచారణకు హాజరుకాకపోతే ఆయనపై నాన్-బెయిలబుల్  అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చునని సమాచారం.