
ఏడు దశలలో నిర్వహించబడుతున్న లోక్‌సభ ఎన్నికలలో నేడు 6వ దశకు పోలింగ్ జరుగబోతోంది. నేడు డిల్లీతో సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలలో 59 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో :14, హర్యానా: 10, మధ్యప్రదేశ్: 8, పశ్చిమబెంగాల్: 8, బిహార్: 8, డిల్లీ: 7, ఝార్ఖండ్ రాష్ట్రంలో 4 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 59 స్థానాల కొరకు 979 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
వారిలో కాంగ్రెస్ నుంచి డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (డిల్లీ ఈశాన్యం), ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ (సౌత్ ఢిల్లీ), అజయ్ మకాన్, మధ్యప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా(గుణ), కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(భోపాల్), బిజెపి నుంచి గౌతమ్ గంభీర్ (ఈస్ట్ ఢిల్లీ), సాద్వీ ప్రజ్ఞాసింగ్(భోపాల్), వరుణ్ గాంధీ (యూపీ, ఫిలిబిత్), నేపద్య గాయకుడు హన్స్ రాజ్ హన్స్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (అజంఘడ్, యూపీ), ఇంకా మేనకా గాంధీ (సుల్తాన్ పూర్, యూపీ), మనోజ్ తివారీ(డిల్లీ ఈశాన్యం), మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తదితర ప్రముఖుల జాతకాలు ఈరోజు ఓటర్లు తేల్చనున్నారు.
ఇప్పటివరకు జరిగిన 5 దశల ఎన్నికలలో మొత్తం 424 స్థానాలకు పోలింగ్ జరిగింది. నేడు 59 స్థానాలకు ఈ నెల 19న జరుగబోయే చివరిదశలో మిగిలిన 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కించి ఆదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు.