ఇందిరాపార్కులో కాంగ్రెస్‌ నేతలు ఫైట్!

ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవకలను నిరసిస్తూ శనివారం ఉదయం ఇందిరాపార్కులో అఖిలపక్షనేతలు దీక్షను నిర్వహిస్తున్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్‌, టిడిపి, టిజేఎస్‌, వామపక్షాల నేతలు హాజరయ్యారు. వేదికపై తక్కువ కుర్చీలు ఉండటంతో దీక్షలో పాల్గొన్న నేతలందరికీ అవి సరిపోలేదు. సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుకు కూడా కూర్చోనేందుకు కుర్చీ లేకపోవడంతో ఓ కుర్చీలో కూర్చొని ఉన్న కాంగ్రెస్‌ నేత నగేష్ ను లేచి నిలబడవలసిందిగా వి.హనుమంతరావు కోరారు. కానీ నగేష్ పట్టించుకోకపోవడంతో వి.హనుమంతరావు ఆయనను బలవంతంగా కుర్చీలో నుంచి పైకి లేవదీసేందుకు ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించారు. ఈ సందర్భంగా వారిరువురి మద్య కాసేపు తోపులాటలు జరిగాయి. ఆ తోపులాటలో వి.హనుమంతరావు క్రిందపడిపోగా వేదికపై ఉన్నవారు ఆయనను పైకి లేపారు. కానీ ఆయన మళ్ళీ నగేష్ పై కలబడి క్రిందకు తోసేశారు. వెంటనే అక్కడున్నవారు ఇద్దరినీ విడదీసి శాంతపరచడంతో వి.హనుమంతరావు వెనక్కు తగ్గారు. ఇంత వయసులో కూడా వి.హనుమంతరావులో ఆవేశం, దూకుడు ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యకరమే.