
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ పర్యటనలో ఆయన తొలుత కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు. అక్కడి నుంచి తమిళనాడు రామేశ్వరం వెళ్ళి రామనాధస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ధనుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్ మందిరాలను దర్శించుకొన్న తరువాత అక్కడి నుంచి మధురై వెళ్ళి మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో కలియతిరిగి వాటి నిర్మాణాలను, ఆలయ ప్రాశస్యతను ఆలయ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. తమిళనాడులో మహాబలిపురం, శ్రీరంగం ఆలయాలను కూడా దర్శించుకోవలసి ఉంది కానీ డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో సమావేశం రద్దు అవడంతో పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ తిరిగివచ్చారు.
సిఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో పుణ్యక్షేత్రాలకు సందర్శనకు బయలుదేరటాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తప్పు పట్టారు. ఆయన నిన్న హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుండగా, సిఎం కేసీఆర్ రాష్ట్రాన్ని, ప్రజలను గాలికొదిలేసి ప్రత్యేక విమానం వేసుకొని కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. ఐదేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది. పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కాలేజీలలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలేదు. యూనివర్శిటీలలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ, అక్షరాస్యత అట్టడుగు స్థాయికి చేరుకొంది. గ్రామాలకు కనీసం బస్సు సౌకర్యం కల్పించకపోవడం వలన హాజీపూర్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటే కనీసం ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పేరుకుపోయుండగా సిఎం కేసీఆర్ కుటుంబాన్ని వెంటపెట్టుకొని తీర్ధయాత్రలు చేస్తున్నారు,” అని విమర్శించారు.