
బుదవారం హరియానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను టాక్సీలా వాడుకొన్నారు. దానిపై ఆయన తన బావమరుదులతో కలిసి సరదాగా విహారయాత్ర చేసి వచ్చారు. వారందరూ 10 రోజుల పాటు ఒక దీవిలో హాయిగా గడిపారు. ఆ 10 రోజులు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక, దానిపై ఒక నేవీ హెలికాఫ్టర్ వారికోసం అక్కడే వేచి ఉన్నాయి. దేశభద్రతకు వినియోగించవలసిన యుద్ధవిమానాన్ని టాక్సీలా ఉపయోగించుకోవడమే కాకుండా దానిలోకి విదేశీయులను కూడా తీసుకువెళ్లి ఆ యుద్ధనౌకకు సంబందించిన రహస్య వివరాలు బహిర్గతం చేశారు. ఇటువంటి కాంగ్రెస్ నేతలా దేశాన్ని కాపాడుతారు? మే 24వ తేదీన మళ్ళీ నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ నేతలకు అర్ధమైపోయింది. అందుకే వారు నాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు,“ అని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు.
సాధారణంగా మనదేశంలో ఎవరూ చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ సాక్షాత్ ప్రధాని మోడీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ తన అధికారాలను దుర్వినియోగం చేసి యుద్ధనౌకపై విదేశీయులతో విహారయాత్రకు వెళ్ళి ఉంటే ఆదివారం ఖచ్చితంగా తప్పే. కానీ ఆయన బ్రతికి ఉండగానే బిజెపి దానిని ఖండించి ఉంటే ప్రజలు కూడా ఆమోదించేవారు. కానీ రాజీవ్ గాంధీ చనిపోయిన రెండున్నర దశాబ్ధాల తరువాత ఇప్పుడు ఎన్నికల ప్రచారసభలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజకీయలబ్ది పొందాలనుకోవడాన్ని ఎవరూ హర్షించరు.