
లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకొంటుండటంతో ప్రధానపార్టీలైన కాంగ్రెస్, బిజెపిల మద్య మాటల యుద్దం తీవ్రమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి ‘చౌకీదార్ చోర్’ (కాపలాదారుడే దొంగ) అని ఎద్దేవా చేయగా, మీ తండ్రి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ నెంబర్: 1 భ్రష్టాచారి (అవినీతిపరుడు) అని ప్రధాని నరేంద్రమోడీ ఎదురుదాడి చేశారు. అందుకు ప్రతిగా ఏఐసిసి కార్యదర్శి ప్రియాంకా వాద్రా “మహాభారతంలోని దుర్యోధనుడికి ఉన్నంత అహంకారం ప్రధాని నరేంద్రమోడీకి ఉంది. అంత అహంకారం ఉన్నవారెవరినీ ఈ దేశం క్షమించబోదని చరిత్ర చెపుతోంది. అలనాడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు మంచిమాటలు చెప్పాలని ప్రయత్నిస్తే దురహంకారంతో వ్యవహరించి నాశనం అయ్యాడు. ఇప్పుడు మోడీ కూడా దుర్యోధనుడిలాగే వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ది,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి ప్రియాంకా వాద్రా అంతా ఘాటుగా విమర్శలు చేస్తే బిజెపి నేతలు చూస్తూ ఊరుకోరు కనుక విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ రంగంలో దిగిగి అంతకంటే ఘాటుగా బదులిచ్చారు. “ప్రియాంకా జీ! ఈరోజు మీకో విషయం గుర్తుచేయదలిచాను. 2013లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ఒక ఆర్డినెన్స్ ను మీ సోదరుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చించివేసి అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను అవమానించారు. అదీ అహంకారం అంటే! ఇంత అహంభావిని మీ పక్కన పెట్టుకొని మాకు పాఠాలు చెపుతున్నారా?” అని ప్రశ్నించారు. ఇంతకీ కాంగ్రెస్, బిజెపిలలో దుర్యోధనుడిని పోలినవారెవరు?