
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, గిరిజన సంక్షేమశాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్‌కు ఊహించిన కష్టం వచ్చి పడింది. సుమారు ఏడు నెలల క్రితం ఆయన తండ్రి, అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో సిఎం చంద్రబాబునాయుడు శ్రావణ్ కుమార్‌కు మంత్రిపదవి ఇచ్చారు. కానీ రాజ్యాంగం ప్రకారం మంత్రులుగా ఉన్నవారు తప్పనిసరిగా శాసనసభ లేదా మండలిలో సభ్యులై ఉండాలి. ఒకవేళ కాకపోతే మంత్రి పదవి చేపట్టిన ఆరునెలలోగా ఉభయసభలలో ఏదో ఒక దానికి తప్పనిసరిగా ఎన్నిక అవవలసి ఉంటుంది. కానీ ఇంతవరకు శ్రావణ్ కుమార్ ఉభయసభలలో దేనిలోనూ సభ్యత్వం పొందలేకపోవడంతో ఆయనకు 6 నెలల గడువు మే 10వ తేదీతో ముగుస్తుంది. ఆ తరువాత ఆయన పదవిలో కొనసాగలేరు. తక్షణమే పదవి కోల్పోతారు. అటువంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కొనే కంటే ముందుగానే ఆయన తన పదవికి రాజీనామా చేసి తప్పుకొంటే గౌరవంగా ఉంటుందని సూచిస్తూ గవర్నర్ నరసింహన్ సిఎం చంద్రబాబునాయుడుకు లేఖ వ్రాశారు. ఏప్రిల్ 7న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కిడారి శ్రావణ్ కుమార్ పోటీ చేశారు. కానీ మే 23వరకు ఫలితాలు రావు కనుక తన పదవిలో నుంచి దిగిపోక తప్పదు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి, కిడారి శ్రావణ్ కుమార్ కూడా విజయం సాధించితే మళ్ళీ మంత్రిపదవి లభించవచ్చు.