ఏపీకి తప్పింది కానీ ఒడిశాకు తప్పదు

భయానకమైన ఫణి తుఫాను దెబ్బ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కొద్దిపాటి నష్టంతో బయటపడగలిగింది కానీ ఒడిశాకు మాత్రం ఇంకా పెనుప్రమాదం పొంచిఉంది. గురువారం నుంచి ఉత్తరాంద్ర జిల్లాలైన విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. అయితే ఫణి తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువగా కనిపించింది. జిల్లాలో పలుప్రాంతాలలో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. భారీగా వర్షం పడింది.  శుక్రవారం ఉదయం ఫణి తుఫాను ఆంధ్రప్రదేశ్‌ తీరం దాటి ఒడిశావైపు సాగినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో ఫణి తుఫాను ప్రమాదం నుంచి ఏపీ తప్పించుకొన్నట్లే భావించవచ్చు. కానీ ఒడిశాకు పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఫణి తుఫాను ప్రభావం కారణంగా గంటకు 115-130 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫణి తుఫాను విపత్తును ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది, తుఫాను అనంతరం సహాయ చర్యలు చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఫణి తుఫాను కారణంగా ఒడిశా వైపు వెళ్ళే పలు రైళ్లు, విమానాలు, బస్సు సర్వీలు కూడా రద్దు చేయబడ్డాయి. ఇక సరుకు రవాణా వాహనాలను ముందు జాగ్రత్తచర్యలలో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల వైపు వెళ్లకుండా అధికారులు ముందే ఎక్కడికక్కడ నిలిపివేశారు. దాంతో ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల వైపు వెళ్ళే జాతీయ రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.     

ఫణి తుఫాను శుక్రవారం ఉదయం 10-11 గంటల మద్య ఒడిశాలోని పూరీ సమీపంలో బలుగోడు వద్ద తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ సమయంలో గంటకు 170-200 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కనుక తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పెను విధ్వంసం తప్పకపోవచ్చు. ఫణి తుఫాను ప్రభావిత శ్రీకాకుళం జిల్లాలో, ఒడిశాలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువే వర్షం పడవచ్చునని అధికారులు తెలిపారు. అంటే ఊహకు అందని స్థాయిలో అతిభారీ వర్షాలు కురవబోతున్నాయన్న మాట. భారీ వర్షం కారణంగా కూడా పెనువిపత్తు సంభవించవచ్చు కనుక ఏపీ, ఒడిశా రాష్ట్రాలలో అధికారులు అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేసుకొన్నారు.

 

ఫణి పెనుతుఫాను ఒడిశాలో తీరం దాటాక కొంత బలహీనపడి పశ్చిమబెంగాల్ వైపు అక్కడి నుంచి మరింత బలహీనపడి అల్పపీడనంగా మరి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోకి ప్రవేశించవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

earth.nullschool.net అనే ఈ లింకు ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రస్తుతం ఈదురుగాలుల వేగం తెలుసుకోవచ్చు.