ఏపీ, తెలంగాణ డిస్కంల వెబ్‌సైట్లు హ్యాక్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సరఫరా సంస్థల వెబ్‌సైట్లను గుర్తు తెలియని హ్యాకర్లు హ్యాక్ చేసి వాటిలో ఉన్న సమాచారాన్ని తస్కరించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ శాఖలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్, ఏపీ ఎస్‌పీడీసీఎల్, ఏపీ ఈపీడీఎస్‌ఎల్ వెబ్‌సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. తస్కరించిన సమాచారాన్ని మళ్ళీ తీరి ఇచ్చేందుకు హ్యాకర్లు రూ.35 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. కానీ హ్యాకర్ల నుంచి ఇటువంటి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని ముందే జాగ్రత్తపడిన ఏపీ, తెలంగాణ డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ముందుగానే బ్యాకప్ చేసి ఉంచుకోవడంతో పెనుప్రమాదం తప్పిపోయింది. సాంకేతిక నిపుణులు మళ్ళీ వెబ్‌సైట్లను స్వాధీనం చేసుకొని వాటిలో హ్యాకర్లు సృష్టించిన వైరస్ ను తొలగించేపని మొదలుపెట్టారు. తెలంగాణ డిస్కం అధికారులు హ్యాకింగ్ గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.