
ఇంటర్మీడియెట్ బోర్డులో జరిగిన అవకతవకలపై నిరసనలు తెలియజేస్తున్న ప్రతిపక్షపార్టీల నేతలను, విద్యార్ది సంఘాల నేతలను, విద్యార్దులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండటంతో హైదరాబాద్ నగరం అట్టుడికిపోతోంది. ఈరోజు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని అఖిలపక్షనేతలు నిన్ననే ప్రకటించడంతో కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్, వామపక్షాలకు చెందిన అనేకమంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, జానారెడ్డి, ప్రొఫెస్సార్ కోదండరాం తదితర నేతలను గృహనిర్బందం చేశారు. అయినప్పటికీ ఏదోవిధంగా ప్రతిపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు, విద్యార్దులు భారీ సంఖ్యలో ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అక్కడికి వస్తున్న వారిని, ఇతర ప్రాంతాల నుంచి అక్కడకు బయలుదేరుతున్నవారిని పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ నేటి నుంచి నిరవదిక నిరాహారాదీక్ష ప్రారంభించడంతో ఆయనకు సంఘీభావం తెలుపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది కార్యకర్తలు అక్కడికి తరలివస్తుండటంతో వారిని నియంత్రించడానికి పోలీసులు చలా శ్రమపడవలసి వస్తోంది.
బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, జితేందర్ రెడ్డి, డికె అరుణ తదితర నేతలు అక్కడకు చేరుకొని ఆయనకు సంఘీభావం తెలిపి ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని, గ్లోబరీనా సంస్థపై కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.