
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2వ దశ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలవడంతో వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. రెండవ దశలో 31 జిల్లాలోని 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు జరుగుతాయి. మూడవ మరి చివరి దశ ఎన్నికలకు ఏప్రిల్ 30వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. మూడవ దశలో 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు మాత్రం మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే ప్రకటిస్తారు.
వేర్వేరు కారణాల చేత రాష్ట్రంలో 40 ఎంపీటీసీ స్థానాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని 15, అదేవిధంగా భద్రాచలంలోని బూర్గులపాడులోని 11 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది జూలై వరకు పదవీకాలం ఉంది. కనుక ఆ రెండు చోట్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఇక ములుగులోని 14 ఎంపీటీసీ స్థానాలపై న్యాయవివాదం నెలకొని ఉన్నందున వాటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని నాగిరెడ్డి తెలిపారు.