నల్గొండకు కాంగ్రెస్‌ శాపం!

ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్‌ పార్టీ శాపంగా మారిందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న జిల్లాలో నార్కాట్ పల్లిలో పరిషత్ ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడుతూ, “ దశాబ్ధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ చిరకాలంగా పాలించిన కాంగ్రెస్‌ నేతలు ఈ సమస్యను పరిష్కరించలేదు. కనీసం పట్టించుకోలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ గ్రామానికి త్రాగుసాగు,నీరు అందించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మే నెలాఖరులోగా ఉదయాసముద్రం ప్రాజెక్టును పూర్తిచేసి ట్రయల్ రన్ నిర్వహిస్తాము. కాంగ్రెస్, టిడిపి హయంలో నాశనం అయిన మునుగోడు, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాలలో పంటలకు పుష్కలంగా నీళ్ళు అందిస్తాము. 

కాంగ్రెస్‌ నేతల ఫ్యూడల్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఆ కారణంగానే వారు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తానుయాధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం నిలిపించేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడమే అందుకు ఉదాహరణ. అందుకే ఆయనకు జిల్లా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్‌ నేతల ఫ్యూడల్ ఆలోచనాధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. 

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలను వదిలించుకొన్నాము. లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించాలంటే పరిషత్ ఎన్నికలలో కూడా తెరాస అభ్యర్ధులనే గెలిపించుకోవాలి. అప్పుడే గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుంది. సిఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే నకిరేకల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరారు,” అని అన్నారు.