
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్నుద్దేశ్యించి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ఇంటర్ బోర్డులో అవకతవకలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. ఈ రెండు సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ బోర్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పు పట్టారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, “ఇంటర్ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్ దేశాన్ని ఏవిధంగా ఉద్దరించగలనని అనుకొంటున్నారు? కేసీఆర్ దృష్టి ఎప్పుడూ ఓట్లు, సీట్లు, ఫిరాయింపుల మీదనే ఉంటుంది తప్ప ప్రజా సమస్యలపై ఉండదు. ఇంటర్ బోర్డులో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే, విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏవిధంగా తెరాసలోకి ఫిరాయింపజేయాలనే ఆలోచిస్తున్నారు. సర్పంచ్ లకు ఇంతవరకు చెక్ పవర్ ఇవ్వకపోవడం వలన గ్రామాలలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతునాయి. గ్రామాలలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇంటిని చబెట్టుకోలేని వాడు దేశాన్ని ఎలా చక్కబెట్టగలడు?” అని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్పై చర్యలు తీసుకోవలసిందిగా కోరామని, సమయం వచ్చినప్పుడు తగినవిధంగా స్పందిస్తానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు.
టిజేఎస్ అధినేత కోదండరాం నాంపల్లిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్ బోర్డులో అవకతవకలకు విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తెరాసలో ముగ్గురు పెద్దల కారణంగానే ఇంటర్ బోర్డులో ఈ సమస్య తలెత్తింది. అందుకే ఇంత జరిగినా ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఊరుకొంది. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ దానికి ఎందుకు కట్టబెట్టారు? ఇంటర్ ఫలితాలలో ఇంత గందరగోళం ఏర్పడటానికి కారణమైన బోర్డు అధికారుల మీద, గ్లోబరీనా సంస్థపై తక్షణమే ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.