నేడు మూడో దశ పోలింగ్‌

ఏడు దశలలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో నేడు 3వ దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఈరోజు జరుగుతున్న పోలింగులో కాంగ్రెస్‌ రాహుల్ గాంధీ (కేరళలోని వయనాడ్), బిజెపి అధ్యక్షుడు అమిత్ షా(గుజరాత్, గాంధీ నగర్) అలనాటి ప్రముఖ నటి జయప్రద (యూపీ, రాంపూర్), వివాదాస్పద నేత శశీ ధరూర్, లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడుగా వ్యవహరించిన మల్లిఖార్జున ఖర్గే, ములాయం సింగ్ యాదవ్ వంటి హేమాహేమీల భవిష్యత్ తేలనుంది. 

రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలో వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నందున ఆ లోక్‌సభ నియోజకవర్గం దేశప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడి నుంచి వామపక్ష కూటమికి చెందిన ఎల్డీఎఫ్ తరపున సిపిఐ అభ్యర్ధి పీపీ సునీర్, బిజెపి అభ్యర్ధిగా తుషార్ వెల్లపల్లి రాహుల్ గాంధీతో పోటీ పడుతున్నారు.

ఈరోజు 3వ దశలో ఉత్తరప్రదేశ్: 10, పశ్చిమబెంగాల్: 5, ఒడిశా: 6, మహారాష్ట్ర: 14, గుజరాత్: 26, బీహార్: 5, ఛత్తీస్ ఘడ్: 7, కేరళ: 20, కర్ణాటక: 14, గోవా:1, అసోం: 4, జమ్మూకశ్మీర్‌ 1, డామన్‌ అండ్‌ డయ్యూ:  1, దాద్రా నగర్‌ హవేలీ: 1 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.