నేను అలా అనలేదు: కేసీఆర్‌

గత నెల 17న కరీంనగర్‌లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్‌ హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో దానిపై సంజాయిషీ కోరుతూ ఈసీ ఆయనకు నోటీసు పంపించింది. 

సిఎం కేసీఆర్‌ ఈసీకి బదులిస్తూ వ్రాసిన లేఖలో “నేను ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకొని వారి ఓట్లు పొందేందుకు హిందువులను కించపరుస్తున్నట్లు మాట్లాడానని నాపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదు. నా మాటల సారాంశం అర్ధం చేసుకోవడంలో పొరబడిన మీడియా నేను హిందువులను అవమానించినట్లు పేర్కొంది. కానీ నా ప్రసంగపాఠాన్ని నిష్పక్షపాతంగా పూర్తిగా విన్నట్లయితే మన రాజ్యాంగం ప్రాధమిక అంశమైన  ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని నేను సమర్ధిస్తూ మాట్లాడానని అర్ధం అవుతుంది,” అని పేర్కొన్నారు. 

మార్చి 17న కరీంనగర్‌ బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ, “దేశంలో నరేంద్రమోడీ, అమిత్ షా...బిజెపివాళ్ళు మాత్రమే హిందువులా? మేమందరం కాదా?”అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఆ సందర్భంగా కేసీఆర్‌ “ఈ హిందుగాళ్ళు....బొందుగాళ్ళు...దిక్కుమాలిన దరిద్రపుగాళ్ళు” అంటూ మాట్లాడారు. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు మరో వర్గం ప్రజలను కించపరుస్తూ మాట్లాడటం నేరమని కనుక ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు అందింది. దానికే సిఎం కేసీఆర్‌ ఈవిధంగా సమాధానం ఇచ్చారు.