టిడిపికి 130...వైసీపీకి 140 సీట్లు!

నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో తామే విజయం సాధించబోతున్నామని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా వాటిలో 130 తమకే వస్తాయని చంద్రబాబునాయుడు, 140 తమకే వస్తాయని జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

నిన్న పోలింగ్ ముగిసిన తరువాత సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి 130 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని మళ్ళీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. కేసీఆర్‌, మోడీతో కుమ్మకైనా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ, వాటిని తిప్పి కొట్టేందుకు ప్రజలు భారీగా పోలింగ్ తరలివచ్చి అర్ధరాత్రివరకు క్యూలైన్లలో నిలబడి మరీ ఓట్లు వేశారు. ఓడిపోతున్నామనే ఆందోళనతో వైసీపీ కార్యకర్తలు కర్రలు, కత్తులు పట్టుకొని టిడిపి కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయబ్రాంతులను చేయాలని ప్రయత్నించారు. కానీ ప్రజలు టిడిపి పక్షాన్న నిలిచారని స్పష్టమైన సంకేతాలు మాకు లభించాయి. ప్రజలు తీర్పు ఇచ్చేశారు కనుక ఇక నుంచి కౌటింగ్ జరిగేవరకు 40 రోజుల పాటు టిడిపి కార్యకర్తలు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు పహరాకాస్తూ వాటిని భద్రంగా కాపాడుకోవాలి,” అని అన్నారు. 

జగన్‌ మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో విసిగిపోయున్న ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి ఓపికగా ఓట్లు వేశారు. ఓటమి భయంతోనే టిడిపి విద్వంసం సృష్టించేందుకు ప్రయత్నించింది. దేవుడి ప్రజల ఆశీస్సులు మాకే ఉనాయని తేలిపోయింది. మరొక 40 రోజులలో రాష్ట్రంలో ప్రభుత్వం మరాబోతోంది,” అని అన్నారు.