నేడో రేపో జూ. పంచాయతీ కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపికైన 9,355 మందికి శుక్రవారం నియామకపత్రాలు అందజేయబోతోంది. వారందరికీ నియామకపత్రాలు అందజేసి విధులలో చేరేందుకు జిల్లాల కలెక్టర్లు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఎంపికైనవారికి వారి సొంత గ్రామాలలో కాకుండా వేరే గ్రామాలలో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది.  

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రతీ పంచాయతీకి తప్పనిసరిగా ఒక జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉండాలని నిర్ణయించడంతో గత ఏడాది ఆగస్టు 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబరు10న రాత పరీక్షలు నిర్వహించింది. కానీ పోస్టుల భర్తీలో నియమనిబంధనలు పాటించకుండా అడ్డుగోలుగా నియామకాలు చేస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో నియామకాలకు బ్రేక్ పడింది. ఆ తరువాత వరుస ఎన్నికల కారణంగా ఎంపికైన అభ్యర్ధులకు నియామకపత్రాలు జారీ చేయడానికి వీలుపడలేదు. త్వరలో మళ్ళీ జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గంట మ్రోగబోతోంది కనుక ఎంపికైన 9,355 మందికి తక్షణమే నియామకపత్రాలు అందజేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు వారందరికీ నియామకపత్రాలు అందజేయనున్నారు.