
చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్కు బుదవారం ఫిర్యాదు చేశారు. ఆయన చేవెళ్ళ నియోజకవర్గంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అనుచరుడు సందీప్ రెడ్డి ద్వారా ఇప్పటికే రూ.15 కోట్లు పంచిపెట్టినట్లు పోలీసులకు ప్రాధామిక ఆధారాలు లభించాయని, పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెరాస నేతలు రజత్ కుమార్కు తెలియజేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినవారిలో తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తెరాస జనరల్ సెక్రెటరీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. ఎన్నికల నియామవళిని యాదేచ్చగా ఉల్లంఘిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.