రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం జరిగిన తీరును నిశితంగా గమనిస్తే, అన్ని పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ కంటే ఏదో ఒక సెంటిమెంటుతో ప్రజలలో భావోద్వేగాలు రగిల్చి ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలనే ఎక్కువగా ప్రయత్నించాయని చెప్పకతప్పదు. తద్వారా అధికార, ప్రతిపక్షాలు తమ వైఫల్యాలు దాచిపెట్టుకొని ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయగలిగాయి. జాతీయస్థాయి పార్టీలు సైతం ఇదేవిధంగా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమే.
ఈ సెంటిమెంటు రాజకీయాల వలన ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కానీ రాజకీయ పార్టీలే ఎంతోకొంత లాభపడతాయనేది ప్రతీ ఎన్నికలలో రుజువవుతూనే ఉంది. గ్రామీణులు, నిరక్షరాస్యులు డబ్బు, మందు వంటి ప్రలోభాలకు, సెంటిమెంట్ రాజకీయాలకు తలొగ్గి ఆయా పార్టీలకు ఓట్లు వేస్తుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ రాజకీయంగా చాలా చైతన్యవంతులైన, ఉన్నత విద్యావంతులైన పట్టణ ప్రజలు కూడా ఈ సెంటిమెంటు ఉచ్చులో చిక్కుకొంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఓటర్లందరూ సెంటిమెంట్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా తమకు...తమ నియోజకవర్గాలకు ఏ అభ్యర్ధి మేలు చేస్తారు? ఏ పార్టీ రాష్ట్రం, దేశాభివృద్ధికి దోహదపడుతుంది? అని లోతుగా ఆలోచించి ఓట్లు వేయడం మంచిది. లేకుంటే రానున్న 5 ఏళ్ళ పాటు ప్రజలే తమ తప్పిదాలకు మూల్యం చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.