
దేశంలోకెల్లా అత్యుత్తమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పుకొంటున్న సిఎం కేసీఆర్ తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో అవినీతి పేరుకుపోయుందని ఒప్పుకొన్నారు. సోమవారం వికారాబాద్ బహిరంగసభలో మాట్లాడుతూ, “భువనగిరికి చెందిన ఒక పెద్దాయన రెండు ప్రభుత్వ కార్యాలయాలలో రూ.30,000 చొప్పున లంచం ఇవ్వవలసి వచ్చిందని నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను సిగ్గుతో తలదించుకొన్నాను.
అధికారులు, ఉద్యోగులు లంచగొండులనో అవినీతిపరులనో నేను అనడం లేదు కానీ కొందరు అవినీతిపరుల వలన ఆ శాఖలకు, ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డపేరు వస్తోంది. కనుక లోక్సభ ఎన్నికల తరువాత మున్సిపాలిటీలలో, పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాలలో ఇంకా ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు చాలా కటినమైన నిర్ణయాలు తీసుకొంటాము. కటినమైన చట్టాలను రూపొందిస్తాము.
ఒక కులంలో పుట్టిన వ్యక్తి చనిపోయెవరకు అదే కులస్తుడుగా ఉంటాడు. మరి అటువంటప్పుడు ప్రతీసారి కుల సర్టిఫికేట్ సమర్పించవలసిన అవసరం ఏమిటి? మన ప్రభుత్వ వ్యవస్థలోని ఇటువంటి లోపాలనన్నిటినీ కూడా సవరించి ప్రజలకు సౌకర్యవంతగా మంచి సేవలు అందించేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను తీర్చిదిద్దుతాము.
నేను కూడా రైతునే కనుక సాటి రైతులు పడుతున్న కష్టాల గురించి నాకు బాగా తెలుసు. వారి భూయాజమాన్యం హక్కులను దృవీకరించి, లావాదేవీలు సులువుగా నిర్వహించుకొనేందుకు, బ్యాంకులలో సులువుగా రుణాలు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తాను. అందుకోసం రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాను. రైతుల ఇళ్లకే అన్నీ అందేలా వ్యవస్థలో మార్పులు చేస్తాను,” అని అన్నారు.