తెలంగాణలో బిజెపికి లక్ష్మణ్ రేఖ?

లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ భరతం పడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ హెచ్చరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌ తానే లక్ష్మణ్, బిజెపిల భరతం పడతానని తిరిగి హెచ్చరించారు. అయితే ఆయనకు ఆ శ్రమ కలిగించకుండానే కె లక్ష్మణ్ సోమవారం ఉదయం పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ బ్రాంచిలో బిజెపి పేరిట ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి సోమవారం ఉదయం ఆయన రూ.8 కోట్లు సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. హిమాయత్ నగర్ ఫ్లై ఓవర్ పై పోలీసులు తనికీలు నిర్వహిస్తున్నప్పుడు ఏపీ 10 బీఈ 1234 నెంబరు ప్లేట్ కలిగిన వెర్నా కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ వాహనాన్ని ఆపి తనికీలు చేయగా దానిలో 2 కోట్లు నగదు లభించింది. దానిని స్వాధీనం చేసుకొని, ఆ వాహనాన్ని, దాని డ్రైవర్ గుండు శంకర్‌ను, వ్యానులో పయనిస్తున్న ప్రదీప్ రెడ్డిని అదుపులో తీసుకొని ప్రశ్నించగా, తనకు బ్యాంక్ వద్ద నందిరాజు గోపీ అనే మరో వ్యక్తి ఆ డబ్బు ఇచ్చినట్లు తెలిపాడు. 

ప్రదీప్ రెడ్డి అందించిన సమాచారం మేరకు పోలీసులు నందిరాజును పట్టుకోగా అతనివద్ద మరో రూ.6 కోట్లు లభించాయి. ఆ తరువాత బిజెపి కార్యాలయంలో పనిచేస్తున్న చలపతిరావు అనే మరో వ్యక్తిని  అదుపులోకి తీసుకొని ముగ్గురినీ ప్రశ్నించగా చలపతిరావు వద్ద కె.లక్ష్మణ్ సంతకంతో జారీ చేసిన ‘సెల్ఫ్ చెక్కు జిరాక్సు కాపీ’ లభించింది. పోలీసులు దానిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నిబందనలకు విరుద్దంగా ఒకేసారి అంత నగదును విడుదల చేసినందుకు ఇండియన్ బ్యాంక్ మేనేజరును కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

రేపటితో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది కనుక రేపు రాత్రి నుంచి అన్ని పార్టీల అభ్యర్ధులు ఓటర్లకు రహస్యంగా డబ్బు పంపిణీ కార్యక్రమం మొదలుపెడతారు. బిజెపి కూడా బహుశః దానికోసమే ఆ నగదును బ్యాంక్ నుంచి తీసినట్లు భావించకతప్పదు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో గెలిచేందుకు బిజెపి కూడా ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదని స్పష్టం అయ్యింది. దీనిపై బిజెపి... రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఏమి సంజాయిషీ చెపుతారో చూడాలి.