తెరాస వాగ్ధానాలకే పరిమితం: కొండా

చేవెళ్ళ కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “ఐదేళ్ళ క్రితం తెరాస మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు జరుగబోయే లోక్‌సభ ఎన్నికల వరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఇచ్చిన హామీలనే మళ్ళీ మళ్ళీ వల్లిస్తోంది తప్ప వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుచేయలేకపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, ఇంటిలో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు వంటి హామీలు అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రజలు నమ్మకంతోనే ఓట్లు వేస్తారు. వారి నమ్మకాన్ని తెరాస వమ్ము చేస్తోంది. 

మా తాతగారి హయం నుంచి మా కుటుంబం చేవెళ్ళలోని ప్రజల మద్యనే ఉంటున్నాము. చేవెళ్ళ నియోజకవర్గంలో గల అన్ని మండలాలను, వాటిలో ప్రతీ గ్రామాన్ని నేను కనీసం ఒక్కసారైనా పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. 

చేవెళ్ళలో తెరాసకు అభ్యర్ధి లభించని కారణంగా కరీంనగర్‌ నుంచి అభ్యర్ధిని తెచ్చుకోవలసి వచ్చింది. అభ్యర్ధినే కాదు ఆయన బహిరంగసభలకు ప్రజలు కూడా లేకపోవడంతో పొరుగునే ఉన్న మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ నుంచి జనసమీకరణ చేసి తెచ్చుకొంటున్నారు. తెరాస అభ్యర్దికి చేవెళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇక ప్రజా సమస్యలను ఏవిధంగా పరిష్కరించగలరు? కనుక ఆయన కూడా యధాప్రకారం తెరాస హామీలను మళ్ళీ గుప్పిస్తున్నారు. 

తెరాసకు ఓటేస్తే అది ఎన్నికల తరువాత బిజెపికె మద్దతు ఇస్తుంది కనుక అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు ఓటేసిన మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటువేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి హామీ ఇస్తే దానికి కట్టుబడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొంది. పంటరుణాల మాఫీ చేస్తామని మాట ఇచ్చింది. వెంటనే అమలుచేసింది. కనీస ఆదాయ పధకం క్రింద ఒక్కో పేద కుటుంబానికి నెలకు రూ.6,000 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి కాగానే ఆ హామీని అమలుచేస్తారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులందరినీ గెలుపించుకొన్నట్లయితే, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేస్తుంది,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.