
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ-9కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో టీవీ-9 ప్రతినిధి మురళి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను సందించారు.
ప్రశ్న: గతంలో పిసిసి అధ్యక్షులుగా చేసిన కే కేశవరావు, డి. శ్రీనివాస్ తెరాసలో చేరిపోయారు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీరు కూడా వారిబాటలోనే వేరేపార్టీలో చేరిపోతారా? లేక పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారా?
ఉత్తమ్: గతంలో ఎవరో ఏదో చేశారని నేను వారిని అనుసరించవలసిన అవసరం లేదు. నాలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది. మరణించేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను.
ప్రశ్న: మిమ్మల్ని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మీ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్న నేపద్యంలో, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతే మీరు దిగిపోతారా?
ఉత్తమ్: నా పదవీకాలం ముగిసిపోయినందున నా స్థానంలో వేరేవారిని నియమించాలని నేనే మా అధిష్టానాన్ని కోరాను. కానీ లోక్‌సభ ఎన్నికలయ్యే వరకు నన్ను పిసిసి అధ్యక్షుడుగా కొనసాగాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో మా పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోబోతోంది.
ప్రశ్న: కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించినా వారు ఎన్నికల తరువాత తెరాసలో చేరిపోతుంటారు కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓటేయడం కంటే తెరాస అభ్యర్ధులకే ఓట్లేసి గెలిపించడం మంచిదని ప్రజలు భావిస్తే?
ఉత్తమ్: లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు తెరాస ఎంపీలే మాపార్టీలో చేరే అవకాశం కూడా ఉంది కదా?
ప్రశ్న: లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 సీట్లు గెలుచుకోబోతోందని, కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని తెరాస చెపుతోంది కదా?
ఉత్తమ్: 16 ఎంపీలతో ప్రధానమంత్రి అవడం సాధ్యమేనా?అవన్నీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొనేందుకు చెపుతున్న మాయమాటలే. ఈసారి కాంగ్రెస్ పార్టీ 200 కుపైగా ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది. మా మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
ప్రశ్న: లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతే గాంధీభవన్‌కు తాళం పడుతుందని తెరాస నేతలు చెపుతున్నారు. నిజమేనా?
ఉత్తమ్: కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ. కనుక దానిని తుడిచిపెట్టేయగలమనుకోవడం అవివేకమే. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులను అనేకసార్లు ఎదుర్కొని మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది.