ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది కనుక ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్ 8న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో మరొకసారి ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఆ రోజు ఉదయం భువనగిరి, మహబూబాద్ పట్టణాలలో బహిరంగసభలలో పాల్గొంటారు. ఆదేరోజు సాయంత్రం మల్కాజ్గిరి, సికిందరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ర్యాలీలో పాల్గొంటారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, సికిందరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డిని మరొకసారి ఓడించి వారి రాజకీయ స్థాయిని తగ్గించాలనే పట్టుదలతో తెరాస గట్టిగా కృషి చేస్తోంది. కనుక ఎన్నికల ప్రచారం గడువు ముగిసేముందు ఆ రెండు నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ తమకు మరికొంత సానుకూలవాతావరణం ఏర్పడుతుందని అభ్యర్ధులు భావిస్తున్నారు.