అమిత్ షా ఏమంటారో...

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో  కరీంనగర్ చేరుకొంటారు. ఉదయం 11.30 గంటలకు స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బిజెపి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండ చేరుకొని, మధ్యాహ్నం 1.30కు స్థానిక జె.ఎన్.ఎం. కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఈ రెండు సభలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొంటారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌కు వెళతారు. గుంటూరు జిల్లాలోని నరసారావుపేట, విశాఖపట్నంలో జరిగే బహిరంగసభలలో అమిత్ షా పాల్గొంటారు.     

మొన్న ప్రధాని నరేంద్రమోడీ వచ్చి వెళ్ళిన తరువాత తెరాస-బిజెపి నేతల మద్య యుద్దం మొదలైంది. నరేంద్రమోడీ ప్రధాని హోదాలో ఉన్నందున ఆయన తెరాస, మజ్లీస్ పార్టీలపై చాలా పరిమిత విమర్శలు చేశారు. కానీ అమిత్ షా ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడు. ఆయనకు అటువంటి పరిమితులు ఏమీ ఉండవు. పైగా ఎన్నికలు కూడా దగ్గరకొచ్చేశాయి. కనుక తెరాస, మజ్లీస్, కాంగ్రెస్‌ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఖాయం. అప్పుడు ఆ మూడు పార్టీలు కూడా అదే స్థాయిలో బదులివ్వడం కూడా ఖాయమే. కనుక అమిత్ షా పర్యటన తరువాత రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కవచ్చు.