
మన దేశంలో ఎన్నికల ప్రక్రియ క్రమంగా ఎంత దిగజారుతోందో తెలిపే సంఘటన ఒకటి బుదవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద పోలీసులు తనికీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఒక వ్యానులో 350 డమ్మీ ఈవీఎంలు కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. సాధారణంగా ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, క్రికెట్ కిట్స్, ల్యాప్ టాప్స్ వంటి బహుమతులను పంపిణీ చేయడం కోసం తరలిస్తున్నప్పుడు పోలీసుల తనికీలలో పట్టుబడుతుండటం చూస్తూనే ఉన్నాము. కానీ అంత శ్రమ ఎందుకు...అసలు ఈవీఎంల స్థానంలో డమ్మీ ఈవీఎంలను పెట్టి పని ముగించుకోవచ్చు కదా? అని సులువైన మార్గం కనుగొన్నారు. కష్టపడి డబ్బు సంపాదించుకోవడం ఎందుకు మనమే మనకు అవసరమైన నోట్లు ముద్రించుకొంటే సరిపోతుంది కదా? అన్నట్లుంది ఈ ఆలోచన.
ఆ వాహనాన్ని దానిలో డమ్మీ ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకొని వ్యాను డ్రైవరును అదుపులోకి తీసుకొని విచారించగా అతను వారికి మరో షాక్ ఇచ్చాడు. పోలవరంలోని వైసీపీ అభ్యర్ధికి కొన్ని డమ్మీ ఈవీఎంలు అందజేసి మిగిలినవి విశాఖపట్నం తీసుకు వెళుతునట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అంటే కొన్ని డమ్మీ ఈవీఎంలు అప్పటికే చేరవలసిన చోటికి చేరాయని గ్రహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ నుంచి డమ్మీ ఈవీఎంలను ఎవరు పంపించారు? వాటిని ఎక్కడి నుంచి వారు సమకూర్చుకొన్నారు? అసలైన ఈవీఎంల స్థానంలో డమ్మీ ఈవీఎంలను ఏవిధంగా అమర్చాలనుకొన్నారు? వారికి ఎవరెవరు సహకరించబోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించవలసి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడ్డాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ నుంచే డమ్మీ ఈవీఎంలు ఏపీకి రవాణా అవుతుండటంతో కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. అయితే డమ్మీ ఈవీఎంల స్వాధీనం కూడా రాజకీయ ఎత్తుగడలో భాగం అయినా ఆశ్చర్యం లేదు. రేపటి నుంచి దీనిపై టిడిపి-వైసీపీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మొదలవుతుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొంటున్న ఎన్నికల సంఘం దీనికి ఏమి జవాబు చెపుతుందో?