వాటి యుద్దాలు కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికేనా?

సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తదితరులు ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, బిజెపి నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ బిజెపి నేతలతో కంటే సిఎం కేసీఆర్‌, మంత్రుల పక్కనే ఎక్కువగా కనబడేవారు. తెరాసను, సిఎం కేసీఆర్‌ను ఏనాడూ పల్లెత్తు మాట అనని దత్తన్న కూడా ఇప్పుడు సిఎం కేసీఆర్‌పై తీవ్రవిమర్శలు చేస్తున్నారు. సవాళ్ళు విసురుతున్నారు. తెలంగాణలో తెరాస గ్రాఫ్ పడిపోతోందని, అదే సమయంలో బిజెపి గ్రాఫ్ పెరిగిపోతోందని దత్తన్న అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 300 సీట్లు గెలిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాలు విసిరారు. కేసీఆర్‌ తన స్థాయికి మించి ప్రధాని నరేంద్రమోడీ పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని దత్తన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రనికి కేటాయించిన నిధులపై ఏ చౌరస్తాలోనైనా చర్చకు బిజెపి సిద్దమని కేసీఆర్‌కు ప్రతిసవాలు విసిరారు. 

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌-తెరాసల మద్యే పోటీ నెలకొని ఉండగా, తెరాస-బీజేపీల మద్యనే ప్రధానంగా పోటీ సాగుతునట్లు ఆ రెండు పార్టీలు కత్తులు దూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెరాస-బిజెపిలు ఈవిధంగా పోరాడుకొంటూ ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోగలిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. ఆ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే కనుక అవి ఈవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.