
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సిఎం కేసీఆర్, తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ అబద్దాలు చెప్పడంలో దిట్ట. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ, ఎన్నికల సమయంలో సెంటిమెంటు రగిల్చి గెలుస్తూ రాష్ట్రంలో ప్రజలందరూ తనవైపే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకొంటుంటారు. తను ఒక్కరే తెలంగాణ సాధించినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయుంటే కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉండేవారు? ఆనాడు సోనియా గాంధీ భజన చేసిన కేసీఆర్ ఇప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాగానే అహంభావంతో విర్రవీగుతూ సోనియా, రాహుల్ గాంధీలపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశానని కేసీఆర్ చెప్పుకొంటున్నారు కానీ అసలైన తెలంగాణ ఇంకా రూపుదిద్దుకోలేదు. కేసీఆర్ మాయమాటలు నమ్మి ఓట్లేస్తున్న ప్రజలు ఏదో ఒకరోజు ఆయనకు ఎందుకు ఓటు వేశామా? అని చింతించవలసి రావచ్చు.
16 ఎంపీలను గెలిపిస్తే డిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్ మళ్ళీ మాయమాటలు చెపుతున్నారు. కానీ 15 మంది ఎంపీలున్నప్పుడు ఏమీ చేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు 16 మందితో ఏవిధంగా ఏమి సాధించగలరు? ఈ లోక్‌సభ ఎన్నికలు రాహుల్ గాంధీ-నరేంద్రమోడీ మద్య జరుగుతున్నాయి. ప్రాంతీయ పార్టీ అయిన తెరాసకు వీటితో సంబందం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధులకు రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపించినట్లయితే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు అన్ని మంజూరు అవుతాయి.
కేసీఆర్ బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. వారికీ వారిని ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికలలో ప్రజలే బుద్ది చెప్పాలి,” అని విజయశాంతి అన్నారు.