లోక్‌సభ ఎన్నికల తరువాత...ఎన్నికలు!

గత ఏడాది సెప్టెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు వాటి తరువాత లోక్‌సభ ఎన్నికలు అవి పూర్తికాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగబోతున్నాయి. 

ఈ నెల 11న లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వీటి కోసం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో మంగళవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్నికలకు చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నందున ఈ నెల 7లోగా పోలింగు బూత్ ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్లను కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకోసం ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది కనుక ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కనుక లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే ఈ ఎన్నికలు కూడా జరిగిపోతాయి.