
తెరాస పార్టీ ‘సారు..కారు...పదహారు..డిల్లీ సర్కారు…’అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ తెరాసపై సెటైర్లు వేశారు.
“గులాబీ కారు కేసీఆర్‌దే కావచ్చు కానీ దాని స్టీరింగ్ మాత్రం మజ్లీస్ చేతిలో ఉంది. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళయిపోతారన్నట్లు మజ్లీస్ సావాసంతో తెరాస కూడా పనికిరాని కారుగా మారిపోతుంది. పాతబస్తీలో మెట్రో రైల్ ఏర్పాటు చేస్తామంటే మజ్లీస్ పార్టీ అడ్డుకొంటోంది. అభివృద్ధికి మజ్లీస్ పార్టీ స్పీడ్ బ్రేకరులా తయారైంది. మజ్లీస్ పార్టీకి అభివృద్ధి నచ్చదు. మరి అటువంటి పార్టీతో కేసీఆర్ ఎందుకు దోస్తీ చేస్తున్నారో ఆయనే చెప్పాలి. కానీ ఆ దోస్తీని అడ్డం పెట్టుకొని ఏదో ఒకరోజు మజ్లీస్ పార్టీ కారు టైరును పంక్చర్ చేయడం ఖాయం.
మా హయాంలో దేశంలో ఎక్కడా బాంబు పేలుళ్ళు జరుగలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంటే దానినీ కొందరు తప్పు పడుతున్నారు. హీరోలు ఎవరో...పాక్ ఏజంట్లు ఎవరో ప్రజలే నిర్ణయించాలి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందిస్తూనే ఉంది. తెలంగాణ పట్ల ఏనాడూ వివక్ష చూపలేదు. ఆ అవసరం లేదు కూడా. తెలంగాణకు మెట్రో రైల్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎయిమ్స్ ఆసుపత్రి వంటివి అనేకం అందించాము. తెలంగాణా అభివృద్ధికి మేము చిత్తశుద్దితో కృషి చేస్తున్నందునే రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు వచ్చి బిజెపిలో చేరుతున్నారు. బిజెపి గెలిస్తేనే కేంద్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కనుక రాష్ట్రంలో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.