
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్, బిజెపిలను ఎండగట్టారు. “దాదాపు ఏడు దశాబ్దాలపాటు కాంగ్రెస్, బిజెపిలే దేశాన్ని పరిపాలించాయి. కానీ అవి మాటలు చెప్పే పార్టీలే తప్ప చేతల పార్టీలు కాదని దేశపరిస్థితిని చూస్తే అర్ధమవుతోంది. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా పేదరికం, నిరుద్యోగం, సాగునీరు, త్రాగునీరు, మౌలిక వసతులలేమి వంటి అనేక సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపిలు కాక మరెవరూ వాటికి బాధ్యులు?అయితే కాంగ్రెస్...లేకుంటే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుంటాయి. వాటి పధకాల పేర్లు మారుతుంటాయే తప్ప పేదల జీవితాలలో ఎటువంటి మార్పు కనిపించదు. దేశంలో ఏ రంగాన్ని పట్టి చూసినా సమస్యలే కనిపిస్తుంటాయి. కాంగ్రెస్, బిజెపి నేతల అలసత్వం, అవగాహనారాహిత్యం, సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది లోపించడం వలన దేశంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి.
ఉదాహరణకు దేశంలో రిజర్వ్ బ్యాంక్ మరియు ఇతర ఆర్ధిక సంస్థల వద్ద 25 లక్షల కోట్లు వృధాగా పడున్నాయి. వాటిని ఉపయోగించుకొనే తెలివితేటలు కాంగ్రెస్, బిజెపి పాలకులకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన సింగరేణి కార్మికులు దేశాన్ని కాపాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోరు. వారు కూడా తమ ప్రాణాలకు తెగించి దేశానికి సంపద సృష్టిస్తున్నారు. కనుక వారిపై ఆదాయపన్ను రద్దు చేయమని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపించినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే దేశంలో గుణాత్మకమైన మార్పు రావలసి ఉందని నేను నొక్కి చెపుతున్నాను.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ రైతులు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగం, దేశాభివృద్ధి వంటి విషయాల గురించి మాట్లాడితే బాగుండేది. కానీ వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇది ఆయన స్థాయికి తగదు. తెలంగాణకు మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా చేసేదేమీ ఉండదు ఇటువంటి మాటలు చెప్పడం తప్ప. కనుక 16 మంది తెరాస ఎంపీలను గెలిపించుకొని మన రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకొందాము,” అని కేసీఆర్ అన్నారు.