
సీనియర్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇవాళ్ళ బిజెపిలో చేరబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం డిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన తరువాత ఈవిషయం ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు.
ఆయన రాజీనామా లేఖలో “నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగాను. గత 35-40 ఏళ్ళుగా పార్టీకి వివిద హోదాలలో సేవలందిస్తున్నాను. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో ఆనాటి విలువలు కనుమరుగైపోయాయి. అసెంబ్లీ, ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికలలో డబ్బున్నవారికే టికెట్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు డబ్బే ప్రధాన అర్హతగా మారిపోయింది. కోట్ల రూపాయలు చెల్లించగలిగేవారికే టికెట్లు కేటాయిస్తున్నారు. పార్టీలో దిగజారిన విలువలకు, నాయకత్వ లోపానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన ఈ అవకతవకల గురించి మీ దృష్టికి తీసుకువచ్చేందుకు నేను ప్రయత్నించినప్పటికీ మద్యలో ఉన్న నాయకులు అడ్డుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినప్పటికీ ఎటువంటి ఆత్మపరిశీలన చేసుకోకుండా ముందుకు సాగుతోంది.
దేశభద్రత, ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై కాంగ్రెస్ పార్టీ అనిశ్చిత, ద్వందవైఖరిని నేను నిరసిస్తున్నాను. దీనివలన కాంగ్రెస్ నాయకులపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతోంది.
దేశప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయినందున, పార్టీలో దళారులతో కలిసి నేను పనిచేయలేనని భావిస్తూ నేను పార్టీలో నా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎదిగేందుకు నాకు అనేక అవకాశాలు కల్పించినందుకు స్వర్గీయ ఇందిరా, సోనియా, రాజీవ్, రాహుల్ గాంధీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకొంటున్నాను," అని పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్రాశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, " కాంగ్రెస్ పార్టీలో 3-4 దశాబ్దాలుగా పనిచేసినప్పటికీ నాకు పార్టీలో సముచిత స్థానం, గౌరవం లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఎన్నికలలో టికెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఒక క్రికెట్ టోర్నీలో జట్టు ఓడిపోతే వెంటనే దాని కేప్టెన్ను మారుస్తుంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినా మళ్ళీ అదే వ్యక్తితో ముందుకు సాగడమే కాకుండా ఆయనే లోక్ సభకు కూడా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాదాల వల్ల ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ వలన ఓడిపోయామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇటువంటి నేతలతో కలిసి పనిచేయలేకనే బలమైన నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీలో చేరీ పనిచేయాలని నిశ్చయించుకొన్నాను. సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీలో చేరుతున్నాను," అని పొంగులేటి సుధాకర్ రెడ్డిచెప్పారు.