
సిఎం కేసీఆర్ వేంరెడ్డి నర్సింహారెడ్డికి బాకీ ఉన్నందునే అందరినీ పక్కనబెట్టి నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి ఆయనకు టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికి సిఎం కేసీఆర్ నిన్న మిర్యాలగూడ సభలో ఘాటుగా జవాబిచ్చారు. “టికెట్లు అమ్ముకొనే నీచ సంస్కృతి తెరాసలో లేదు. అటువంటి నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఇద్దరూ కలిసి టికెట్లు అమ్ముకొన్నారని కాంగ్రెస్ నేతలు బోడ జనార్ధన్, సర్వే సత్యనారాయణ, క్యామ మల్లేశం, భిక్షపతి గౌడ్ తదితరులు బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 13 ఏళ్ళ చరిత్ర ఉంది. దానితో పాటే టికెట్లు అమ్ముకొనే నీచమైన చరిత్ర కూడా ఉంది. అందుకే కాంగ్రెస్ నేతలు నేను వేంరెడ్డి నర్సింహారెడ్డికి రూ.100 కోట్లకు టికెట్ అమ్ముకొన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి తెరాసయే ఆయనకు పార్టీ జెండాలతో సహా ఎన్నికల ప్రచారసామగ్రిని కూడా అందజేస్తోంది.
నల్గొండ, భువనగిరి నుంచి పోటీ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఓటమి భయంతోనే మాపై ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాలో తెరాస ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకొన్నా రాజకీయ సన్యాసం చేస్తానన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నారు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు టికెట్లు అమ్ముకొంటున్నారనే ఆరోపణ తప్పకుండా వినిపిస్తుంటుంది. ఆ ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకొని, అటువంటివి జరిగినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకొని పార్టీని చక్కబెట్టుకొనేందుకు ప్రయత్నించకుండా ఆ ఆరోపణలు చేసిన క్యామా మల్లేశ్ వంటివారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించడమే ఆ సమస్యకు పరిష్కారమని కాంగ్రెస్ భావిస్తుంటుంది. ఫిరాయింపుల కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందనేది ఎంత సత్యమో, పార్టీలో ఆత్మపరిశీలన చేసుకొని లోపాలను సరిదిద్దుకోకపోవడం వలన కూడా పార్టీ బలహీనపడుతోందనేది అంతే సత్యం. చెట్టుకు కాసిన పళ్ళు తింటే మంచిదే కానీ కూర్చోన్న కొమ్మలనే నరుకొంటామంటే ఎవరికి నష్టం?