
శుక్రవారం ఉదయం హయత్‌నగర్ నడిరోడ్డుపై ఒక కారులో హటాత్తుగా మంటలు చెలరేగడంతో అందరూ చూస్తుండగానే కారు మంటలలో దగ్దమైంది. పోలీసుల సమాచారం ప్రకారం విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న విజయ్ రాహుల్ అనే వ్యక్తి తన కారులో విజయవాడ బయలుదేరాడు. ఆయన కారు హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ వద్దకు చేరుకొనేసరికి ఇంజనులో నుంచి పొగలు రావడం చూసి కారులో దిగిపోయాడు. కారు దిగిన వెంటనే ఇంజనులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి కారును కబళించి వేశాయి.
సకాలంలో ప్రమాదాన్ని గుర్తించడంతో కారు యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ అగ్నిమాపకశాఖకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు మంటలలో కాలి బూడిదైపోయింది. వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో కారులో మంటలు చెలరేగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కనుక కారు యజమానులు అందరూ ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందుగానే తమ కారు ఇంజన్, వైర్లను తరచూ పరీక్షించుకోవడం మంచిది. అలాగే తప్పనిసరిగా వాహనాలకు ఇన్స్యూరెన్స్ చేయించుకోవడం చాలా అవసరం.