నిజామాబాద్‌లో పోలింగ్ వాయిదా పడనుందా?

నిజామాబాద్‌లో ప్రధానపార్టీల అభ్యర్ధులకంటే రైతు అభ్యర్ధులే ఎక్కువ ఉండటంతో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెరాస, కాంగ్రెస్‌, బిజెపి తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు కలిపి 9 మంది కాగా మిగిలిన 176 మంది రైతులే. వారందరూ తమ నామినేషన్ పత్రాలను ముందుగానే లాయర్లు, విద్యాధికులతో క్షుణ్ణంగా పరిశీలింపజేసుకొని వాటిలో ఎటువంటి తప్పులు లేకుండా అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకొన్న తరువాతే దాఖలు చేయడంతో ఎన్నికల సంఘానికి వారి నామినేషన్లను తిరస్కరించలేని పరిస్థితి ఏర్పడింది. తెరాస వారికి ఎంతగా నచ్చ జెప్పినప్పటికీ ఎవరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అంగీకరించలేదు. కనుక తప్పనిసరిగా 185 మంది అభ్యర్ధులతో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. 

కానీ ఈవీఎంలలో అంతమంది అభ్యర్ధుల పేర్లను ఇమడ్చడం అసాధ్యం కనుక తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ నిర్వహించవలసి ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీలోగా వారందరి పేర్లతో కూడిన బ్యాలెట్ పేపర్లను ముద్రించి, వాటి కోసం బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకోవలసి ఉంటుంది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఏప్రిల్ 11లోగా సాధ్యం అవకపోతే తప్పనిసరిగా నిజామాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా వేయవలసి ఉంటుంది. 

రాష్ట్రంలో 17స్థానాలకు దాఖలైన నామినేషన్లు, అభ్యర్ధుల వివరాల వివరాలతో పాటు నిజామాబాద్‌లో ఏర్పడిన ఈ సమస్య గురించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసి, దాని ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు రోజులలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.     

నిజామాబాద్‌ జిల్లాలో మండలాలవారీగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన రైతన్నలు:

ఆర్మూర్: 25, జగిత్యాల: 21, జక్రాన్ పల్లి: 20, వేల్పూర్: 19, ముప్కాల్: 13, రాయికల్: 11, మోర్తాడ్: 8, ఇబ్రహీంపట్నం: 7, మెండోరా, ఎర్గట్ల, కోరుట్లలో ఒక్కో చోట 5 మంది, బాల్కొండ, సారంగపూర్, సిరికొండ, మల్లాపూర్: 3, మల్యాల, కధాలాపూర్, గొల్లపల్లి: 1, ఇందల్ వాయి, మేడిపల్లి, నందిపేట్ మండలాలలో ఒక్కొక్కరు చొప్పున రైతన్నలు బరిలో ఉన్నారు.