
తెరాస, కాంగ్రెస్ పార్టీలను వీడి బిజెపిలో చేరిన ఎంపీ జితేందర్‌రెడ్డి, డికె అరుణ గురువారం మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, “ఎవరైనా శత్రువులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. కానీ సిఎం కేసీఆర్ మిత్రులపైనే సర్జికల్ స్ట్రైక్ చేశారు. సిఎం నన్ను ‘డ్రాప్’ చేస్తే పిఎం నన్ను ఎత్తుకొన్నారు. నా అదృష్టాన్ని ఎవరూ గుజుకోలేరు. కేంద్రప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అనేక పధకాలు, నిధులు మంజూరు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం వాటిని అమలుచేయకుండా కాలక్షేపం చేస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ ప్రభుత్వం దానిని ఆమోదిస్తూ ఇంతవరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 150-200 సీట్లు మాత్రమే వస్తాయని, కనుక తెరాస 16 సీట్లు గెలుచుకొంటే డిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ పగటికలలు కంటున్నారు. కానీ ఈసారి ఎన్నికలలో బిజెపికి సొంతంగా 300 సీట్లు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.
సాధారణంగా పార్టీ మారినవారు ఈవిధంగా విమర్శలు చేయడం వాటిని ఆయా పార్టీలు తిప్పికొట్టడం సహజమే. కానీ పార్టీలు మారుతున్నవారు చెపుతున్న మాటలను పూర్తిగా కొట్టిపారేయలేము. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేధాలు, సమస్యలు, విధానపరమైన లోపాలను వారి మాటలు పట్టి ఇస్తుంటాయి. తెరాసలో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందని చెపుతుంటే, తెరాస నేతలలో నెలకొన్న అసంతృప్తిని జితేందర్‌రెడ్డి బయటపెట్టారు. పార్టీలో ఉండగా వారు ఇటువంటి విషయాలను నిర్భయంగా పార్టీ అధిష్టానానికి చెప్పలేరు కనుక, పార్టీ మారిన తరువాత చెపుతున్న వారి మాటలను ఖండించిన తరువాతైనా ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది.