పంటలకు కాదు...ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు: రేణుక

ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్ధి రేణుకా చౌదరి సిఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలపై తీవ్ర విమర్శలు చేశారు. 

“సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయారు కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగలిగారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి నిసిగ్గుగా మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెరాసలో చేర్చుకొంటున్నారు,” అని విమర్శించారు.  

ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి, “మోడీ తాను దేశానికి చౌకీదార్ (కాపలాదారు)నని చెప్పుకొంటారు కానీ కనీసం ఆ ఉద్యోగానికి కూడా ఆయన పనికిరారు. ఎందుకంటే, ప్రజల డబ్బును కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్న నీరవ్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా వంటివారిని అడ్డుకోలేకపోయారు. కనీసం ఇప్పుడైనా వారిని అరెస్ట్ చేయించి భారత్‌ తీసుకురాలేకపోతున్నారు.”

“కుటుంబం, అనుబందాలు, అప్యాయతల గురించి తెలియని నరేంద్రమోడీ దేశ ప్రజలను మాత్రం ఏవిధంగా ప్రేమించగలరు? ఈ దేశం కోసం నెహ్రూ కుటుంబం అనేక త్యాగాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటూ దానిని పరిరక్షిస్తోంది. కనుక దేశప్రజలు మళ్ళీ స్వేచ్ఛగా, సుఖంగా జీవించాలంటే ఈ లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోను, జాతీయ స్థాయిలోను కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశసమస్యలన్నీ పరిష్కరించగలరు,”అని రేణుకా చౌదరి అన్నారు.