
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజల సురేందర్ బుదవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి మాట్లాడిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తెరాసలో చేరుతానని తెలిపారు.
అనంతరం సురేందర్ మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అయ్యింది. పార్టీలో ఒంటెత్తు పోకడలు సాగుతున్నాయి. ప్రజలందరూ తెరాసవైపు ఉన్నారు. కనుక ప్రజాభీష్టానికి అనుగుణంగా నేను కూడా నా నియోజకవర్గం అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిశ్చయించుకొన్నాను. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించిన కొత్తలో నేను కూడా ఆయన వెంటే ఉండి చాలా కాలం పోరాడాను. ఆ కారణంగా నాకు తెరాస నేతలతో, కార్యకర్తలతో మంచి స్నేహసంబందాలున్నాయి. కామారెడ్డి అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉండాలని కోరుకొంటున్నాను. అందుకే తెరాసలో చేరుతున్నాను. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా పొందిన నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా వారిలో సురేందర్‌తో కలిపి ఇప్పటి వరకు 10 మంది తెరాసలో చేరారు. మరో 3-4 మంది ఎమ్మెల్యేలను తెరాసలోకి రప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్షహోదా కోల్పోతుంది. అప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలు చేయనవసరం ఉండదు.
తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: 1. ఆత్రం సక్కు, 2. రేగ కాంతారావు, 3.చిరుమర్తి లింగయ్య, 4. పట్లోళ్ల సబితారెడ్డి, 5. బానోతు హరిప్రియా నాయక్, 6. కందాల ఉపేందర్‌రెడ్డి, 7. బీరం హర్షవర్ధన్‌రెడ్డి, 8. డి.సుధీర్‌రెడ్డి, 9. వనమా వెంకటేశ్వర్రావు, 10. జాజల సురేందర్.