ఫరూక్ వ్యాఖ్యలు బెడిసికొట్టాయా?

చంద్రబాబునాయుడు, టిడిపికి మద్దతుగా జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నిన్న కడప, కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ నన్ను కలిశారు. తనను ఏపీ సిఎం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 1,500 కోట్లు విరాళం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని నాతో చెప్పారు,” అని అన్నారు. 

దీనిపై జగన్‌, వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు కానీ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ తన తండ్రి మరణించిన వెంటనే తాను ముఖ్యమంత్రి అవడం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన మాట వాస్తవమే కానీ కాంగ్రెస్ పార్టీకి 1,500 కోట్లు ఆఫర్ చేశారనేది నిరాధారమైన ఆరోపణ. ఫరూక్ అబ్దుల్లా చేసిన ఆ ఆరోపనను మేము ఖండిస్తున్నాము,” అని అన్నారు.

చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కానీ జగన్‌ అవినీతిని, పదవీ లాలసను బయటపెట్టాలనే ఆలోచనతో ఇటువంటి ఆరోపణ చేస్తే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందనే సంగతి మరిచిపోయినట్లున్నారు. కాంగ్రెస్‌ దానిని ఖండించింది కనుక ఇప్పుడు జగన్ ఫరూక్, చంద్రబాబులపై ఎదురుదాడి చేయవచ్చు.